ఎన్‌టీఆర్ జిల్లా, మే 12, 2024
జిల్లాలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
ఓటు హక్కును వినియోగించుకోనున్న 17.04 లక్షల మంది ఓటర్లు
13,402 ఎన్నికల అధికారులు, సిబ్బందితో పోలింగ్ నిర్వహణ
పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న అధికారులు, సిబ్బంది
జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
జిల్లాలో సాధారణ ఎన్నికలను కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయడం జరిగిందని.. 1,874 కేంద్రాల్లో 13,402 పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎన్నికల నిర్వహణకు ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో చేరుకున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ అధికారులు, సిబ్బందికి స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేసే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 17.04 లక్షల మంది ఓటర్లు వారి ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేయడం జరిగిందన్నారు. సుమారు 13,402 మంది ఎన్నికల అధికారులు, సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేయడం జరిగిందని.. వాటికి సమకూర్చిన వాహనాల ద్వారా కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు సిద్దంగా ఉన్నారని సాయంత్రం 3 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని పోలింగ్ నిర్వహణకు సిద్దంగా ఉండేలా సూచించామన్నారు. నియోజకవర్గాల ఎన్నికల అధికారులు వారి పరిధిలో ఎన్నికల అధికారులకు, సిబ్బందితో పోలింగ్ బూత్‌ల్లో ఏర్పాట్లను పూర్తిచేసుకొని 13వ తేదీ సోమవారం ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. మాక్ పోలింగ్‌లో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమైతే వాటిని పరిష్కరించి ఏడు గంటల కల్లా అసలు పోలింగ్‌ను ప్రారంభించి, ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నామన్నారు.
ప్రతి పోలింగ్ ప్రాంతంలో తాగునీరు, మరుగుదొడ్లు, నీడ, కుర్చీలు, చక్రాల కుర్చీలు, ప్రాథమిక చికిత్స తదితర ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 1,200 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్ జరిగే అవకాశమున్నందున లైటింగ్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు మొబైల్ ఫోన్లు తీసుకురావొద్దని సూచించారు. పోలింగ్ స్టేషన్‌లో మొదట పార్లమెంటు నియోజకవర్గ ఓటింగ్ కంపార్ట్‌మెంట్ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గ ఓటింగ్ కంపార్ట్‌మెంట్ ఉంటాయన్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో 17 మంది, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 20 మంది పోటీలో నిలవడంతో ఈ నియోజకవర్గాల్లో రెండు బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఓటర్లు ఎలాంటి గందరగోళానికి తావులేకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు సహాయ కేంద్రం సేవలందిస్తుందని కలెక్టర్ తెలిపారు.
పోలింగ్ స్టేషన్లలో సీఏపీఎఫ్ యేతర వీడియోగ్రఫీ వంటి ఏర్పాట్లు చేశామన్నారు. ఈవీఎంలకు సంబంధించి ఏవైనా సమస్యలు వస్తే 15 నిమిషాల సమయంలో సరిదిద్దేందుకు అనువుగా ఏర్పాట్లు చేశామని.. సెక్టార్ అధికారులు, అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్లు (ఏఎల్ఎంటీ)లతో పాటు ప్రతి నియోజకవర్గంలో ముగ్గురు చొప్పున బెల్ ఇంజనీర్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
పోలింగ్ పూర్తయిన అనంతరం జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ జరిగిన చోటే రిసెప్షన్ కేంద్రాలు ఉంటాయని.. అక్కడి ఇంటర్మీడియెట్ స్ట్రాంగ్‌రూమ్‌ల్లో ఈవీఎంలను భద్రపరచడం జరుగుతుందన్నారు. అదే విధంగా విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం నియోజకవర్గాలకు సంబంధించి నోవా, నిమ్రా కళాశాలల్లో స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. నోవా, నిమ్రా కళాశాలల్లో 27 స్ట్రాంగ్ రూమ్‌లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు పిలుపునిచ్చారు.