*ఎన్‌టీఆర్ జిల్లా, మే 14, 2024*
మూడంచెల్లో ఈవీఎంల భద్రత కట్టుదిట్టం
ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా 27 స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఏర్పాట్లు
ప్రజలు, రాజకీయ పక్షాల పూర్తి సహకారంతో జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్
జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
ప్రజలు, రాజకీయ పక్షాల పూర్తి సహకారంతో జిల్లాలో పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని.. ఈవీఎంలు, ఇతర సామగ్రిని స్ట్రాంగ్ రూమ్‌ల్లో మూడంచెల భద్రత మధ్య భద్రంగా ఉంచినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
ఇబ్రహీంపట్నం, జూపూడిలోని నోవా, నిమ్రా కళాశాలల ప్రాంగణంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, సెగ్మెంట్లకు సంబంధించి 27 స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ఇక్కడి స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఈవీఎంలను ఉంచి, గదులకు సీల్ వేసే ప్రక్రియ ఎన్నికల సాధారణ పరిశీలకులు మంజూ రాజ్‌పాల్, అభ్యర్థుల మధ్య జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం కలెక్టర్ డిల్లీరావు మీడియాతో మాట్లాడారు. నోవా, నిమ్రా కళాశాలల మూడు క్యాంపస్‌ల్లో నాలుగు భవంతుల్లో స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్లోజ్డ్ వాహనాలు, కట్టుదిట్టమైన భద్రత మధ్య రిసెప్షన్ కేంద్రాలు, ఇంటర్మీడియెట్ స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఈవీఎంలను తీసుకొచ్చి శాశ్వత స్ట్రాంగ్‌రూమ్‌ల్లో భద్రపరచడం జగిందన్నారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా సింగిల్ డోర్, విండోస్, వెంటిలేటర్లు, డబుల్ లాకింగ్ ఉండేలా చూసినట్లు తెలిపారు. వాటర్ లీకేజీకి ఆస్కారం కూడా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదే విధంగా అగ్ని ప్రమాదాలు గానీ, విద్యుదాఘాతాలు కానీ సంభవించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రెండు తాళాలకు సంబంధించి ఒకటి కలెక్టర్ ప్రతినిధి వద్ద, మరొకటి ఆర్‌వో వద్ద ఉంటుందన్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్), రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు సీసీటీవీల నిఘా ఉంటుందన్నారు. సీసీటీవీల ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను అభ్యర్థులు చూసుకోవచ్చన్నారు. ఇందుకు వారికి అనుమతి ఉంటుందని, పాస్‌లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజూ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌లు కూడా సందర్శించి.. అంతా పరిశీలిస్తారని.. రిటర్నింగ్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేయనున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, విజయవాడ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఆర్‌వోలు బీహెచ్ భవానీ శంకర్, ఇ.కిరణ్మయి, అభ్యర్థులు తదితరులు హాజరయ్యారు.