ప్రజాస్వామ్య స్ఫూర్తితో విలువైన ఓటు హక్కును వినియోగించుకోండి
హరిత పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ:- ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు పిలుపునిచ్చారు. విజయవాడ మధ్య నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్ హాల్ హరిత పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ డిల్లీరావు ఆదివారం రాత్రి సందర్శించారు. పచ్చదనంతో నిండి హరిత శోభతో కళకళలాడుతున్న ఈ పోలింగ్ స్టేషన్ ఓటర్లకు సరికొత్త అనుభవాన్ని అందించనుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఏడు నియోజకవర్గాల పరిధిలోనూ ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పండగ రోజైన ఈ నెల 13వ తేదీ సోమవారం ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వైపు అడుగులు వేయాలని.. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక హరిత, యువ, పింక్, విభిన్న ప్రతిభావంతుల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మిగిలిన పోలింగ్ స్టేషన్లతో పోల్చితే ఈ పోలింగ్ కేంద్రాలు వివిధ రకాల సౌకర్యాలతో ప్రత్యేకతను చాటుతాయని కలెక్టర్ తెలిపారు.