ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు నిలుపుదల
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
అమరావతి:- రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటలో తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 16వ తేదీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి అమల్లోకి వచ్చిన ఈ ప్రవర్తన నియమావళి జూన్ 4న ఓట్ల లెక్కింపు ముగిసిన తదుపరి 48 గంటల వరకు అమల్లో ఉందన్నారు. ఎన్నికల్లో వెలువడిన ఫలితాలను బట్టి రాష్ట్రంలో 25 పీసీలకు మరియు 175 ఏసీలకు నూతనంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును నిలుపుదల చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నేటి సాయంత్రం నుండి నిలుపుదల చేసినట్లు జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ఆయన తెలిపారు.*