మచిలీపట్నం జూన్ 8
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టాలని రాష్ట్ర రవాణా
రహదారులు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు.
శనివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం లోని కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర అదనపు డీజీ ఎస్. బాగ్చి, ఐ.జీ.లు రాజశేఖర్ బాబు, అశోక్ కుమార్ పోలీస్ కమిషనర్ రామకృష్ణ, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు డీ.కే. బాలాజీ, ఢిల్లీ రావు, జిల్లా పోలీసు అధికారి అద్నాన్ నయీం అస్మిలతో కలిసి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలోని ఐటి పార్కు మేధ టవర్స్ సమీపంలో గల స్థలాన్ని ఎంపిక చేసామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ తోపాటు పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు విచ్చేయనున్నారన్నారు.
ఇందుకోసం ప్రధాన సభ ప్రాంగణాన్ని బాగా చదును చేసి ముళ్లపొదలను తొలగించే పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. అక్కడ వేదిక, బారికేడింగ్, బ్లాక్ ల విభజన, పారిశుధ్యము ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు.
కార్యక్రమానికి వచ్చే ప్రముఖులకు వసతి, పాసులు ఏర్పాటు చేయాలన్నారు.
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
అందించడంతోపాటు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు.
సభకు వచ్చే అతిథులకు, ప్రజలకు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, ఆహారము ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలన్నారు.
ప్రముఖులకు, ప్రజలకు, మీడియా వారికి అవసరమైన సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.
ఎంపిక చేసిన లేఅవుట్, గంగరాజు, విమానాశ్రయము, వెటర్నరీ కళాశాల,మేధా టవర్సు, పెట్రోల్ బంకు వద్ద గల పార్కింగ్ ప్రదేశాల నుండి ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రహదారులను సజావుగా ఏర్పాటు చేయాలన్నారు.
ప్రధానమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గన్నవరం విమానాశ్రయం నుండి ప్రధాన సభ వేదిక వద్దకు రాకపోకలు, గవర్నర్ రాకపోకల కాన్వాయ్కి ఎలాంటి అడ్డంకులు లేకుండా పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మందుల, అంబులెన్స్ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన గన్నవరం కేసరపల్లి గ్రామంలోని ఐటీ పార్క్ సమీపంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం కోసం స్థలం ఎంపిక చేసామని, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం
చేసేందుకు కృషిచేస్తామన్నారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ముఖ్యమైన ప్రముఖులకు కావాల్సిన అని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఈ సమావేశంలో ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల సంయుక్త కలెక్టర్లు గీతాంజలి శర్మ, సంపత్ కుమార్, డిఐజి గోపీనాథ్ జెట్టి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుడుకర్, విజయవాడ డిసిపి అధిరాజ్ ఎస్. రానా, గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ ఎమ్మెల్కే రెడ్డి, గుడివాడ ఆర్డిఓ పి పద్మావతి
తదితర అధికారులు పాల్గొన్నారు.