ధర్మం గెలిచింది.. దేశం అభివృద్ధి చెందుతుంది
ఇంద్రకీలాద్రి నుండి తిరుమల వరకు పాదయాత్రగా నాగలింగం శివాజీ మహాసంకల్ప యాత్ర ప్రారంభంలో శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామి
విజయవాడ:- దేశ, రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ముచ్చటగా మూడవసారి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలనే తన కోరిక నేరవేరడంతో భాజపా నాయకుడు నాగలింగం శివాజీ మొక్కు చెల్లించేందుకు సిద్ధమవడం హర్షణీయం అని తాళ్ళాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామి అన్నారు. మొక్కు తీర్చుకునే క్రమంలో శనివారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను శివ స్వామితో కలిసి నాగలింగం శివాజీ దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావు వారికి అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఇంద్రకీలాద్రి నుంచి తిరుమల వరకు నాగలింగం శివాజీ చేపట్టిన మహాసంకల్ప పాదయాత్రను శివ స్వామి జెండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ, ధర్మం మరోసారి గెలిచిందని ఫలితంగా దేశం మరింత అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడం శుభపరిణామం అని తెలిపారు. నాగలింగం శివాజీ మాట్లాడుతూ, ఇంద్రకీలాద్రి నుంచి తిరుమల వరకు నిర్వహిస్తున్న మహాసంకల్ప పాదయాత్ర జగన్మాత కనకదుర్గమ్మ, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వార్ల దయతో దిగ్విజయంగా జరగాలని ఆకాంక్షించి యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, పలువురు ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.