*ఎన్‌టీఆర్ జిల్లా, జనవరి 30, 2025*
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలి
పెండింగ్ ఫారం-18 దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి
- అధికారులకు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాలు
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీఐ విడుదల చేసిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) పటిష్ట అమలుకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
గురువారం కలెక్టర్ లక్ష్మీశ.. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆర్‌డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు తదితరులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ అవుతుందని, ఫిబ్రవరి 10 వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న లెక్కింపు ఉంటుందని తెలిపారు. షెడ్యూల్ విడుదలతోనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీ మార్చి 8 వరకు కోడ్‌ను పకడ్బందీగా అమలుచేయాలని స్పష్టం చేశారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పక పాటించి సహకారం అందించేలా డివిజన్, జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఎంసీసీ నియమ నిబంధనలు, ఉల్లంఘనలపై చర్యలు తదితర అంశాలను వివరించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల అధికారిక కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదని, పొలిటికల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, చిహ్నాలు వంటివి తొలగించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, పబ్లిక్ ప్రాంతాల్లో రాజకీయపరమైన ఫొటోలు, పోస్టర్లు వంటివి తొలగించాలన్నారు. కోడ్ అమలుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తాయన్నారు.
*2024, డిసెంబర్ 30 వరకు 78,238 మంది ఓటర్లు:*
పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 2024, డిసెంబర్ 30 వరకు చూస్తే ఎన్‌టీఆర్ జిల్లాలో 101 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 45,540 మంది పురుషులు, 32,685 మంది మహిళలు, 13 మంది టీజీ ఓటర్లు మొత్తం 78,238 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు వీలుకల్పించే ఫారం-18 పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలన్నారు.
ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో వెయ్యి ఓట్లు కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అవసరమైన ఆగ్జలరీ పోలింగ్ బూత్‌లకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
టెలీ కాన్ఫరెన్స్‌లో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, విజయవాడ ఆర్‌డీవో కె.చైతన్య, నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.