*ఎన్‌టీఆర్ జిల్లా, జనవరి 31, 2025*
ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ. 300 అందాల్సిందే
క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది సరైన ప్రణాళికతో వ్యవహరించాలి
- *క్రమశిక్షణ రాహిత్యం కనిపిస్తే ఉపేక్షించను*
- *ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాలన్నీ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలి*
- *తడి-పొడి చెత్త సేకరణ, నిర్వహణ సరైన విధంగా జరగాలి*
- *జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం ద్వారా కూలీలు దినసరి సగటు వేతనం రూ. 300 హక్కుగా పొందేలా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది సరైన ప్రణాళికతో పనులు చేపట్టేలా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ స్పష్టం చేశారు.
శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ ఆర్‌డీవోలు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లుతో ఉపాధి హామీ పథకం, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు, పెన్షన్ల పంపిణీ తదితరాలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ తదితరులకు సరైన అవగాహన కల్పించి, ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ. 300 లభించేలా డ్వామా అధికారులు, ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. పని మార్కింగ్, మస్టరింగ్ విషయాల్లో స్పష్టమైన అవగాహనతో వ్యవహరించాలన్నారు. పటిష్ట పర్యవేక్షణ అవసరమని అప్పుడే లక్ష్యాలను చేరుకునేందుకు వీలవుతుందన్నారు. విధుల నిర్వహణలో ఎక్కడైనా నిర్లక్ష్యం కనిపిస్తే ఉపేక్షించేది లేదని, క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. 286 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న 264 ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు (ఎస్‌డబ్ల్యూపీసీ) పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలన్నారు. కేంద్రాలు లేని 22 గ్రామ పంచాయతీల్లో వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏవైనా మరమ్మతులు అవసరమైతే వెంటనే పూర్తిచేసి, నిర్వహణలోకి తీసుకురావాలన్నారు. అన్ని కేంద్రాలను రహదారితో అనుసంధానం చేసి ఫెన్సింగ్‌తో పాటు వర్మీ సీడింగ్ జరిగేలా కృషిచేయాలన్నారు.
*స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రపై ప్రత్యేక దృష్టిపెట్టండి:*
గ్రామ పంచాయతీల్లో ప్రతి వెయ్యిమందికి ఒక క్లాప్ మిత్ర ఉండేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని గ్రామ పంచాయతీల్లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర అమలుకు చొరవచూపాలని, 100 శాతం తడి, పొడి చెత్తను సేకరించేలా చూడాలన్నారు. అవగాహన శిబిరాల నిర్వహణ, చెత్తనుబట్టి వేర్వేరుగా సేకరించడం, బిన్స్‌ను అందుబాటులో ఉంచడం వంటివి చేయాలన్నారు. అదేవిధంగా హౌస్‌హోల్డ్ డేటాబేస్ సర్వేలో భాగంగా గృహాల జియోట్యాగింగ్, డేటా అనుసంధాన ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
*ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలి:*
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని దృష్టిలో ఉంచుకొని ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని, ఉదయం 6 గంటలకు పంపిణీని ప్రారంభించి, మొదటిరోజే పూర్తిచేసేందుకు కృషిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 2,29,913 పెన్షన్లకు రూ. 98.20 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు. టెలీకాన్ఫరెన్స్‌లో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డ్వామా పీడీ ఎ.రాము, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.