*ఎన్‌టీఆర్ జిల్లా/ఎ.కొండూరు, జి.కొండూరు, జనవరి 30, 2025*
సూక్ష్మ పోషకాల లోపాలపై రైతులకు అవగాహన కల్పించండి
ఉద్యాన పంటలకు స్థానిక మార్కెట్లను అభివృద్ధి చేయాలి
- ఉపాధి హామీ శ్రమ శక్తి సంఘాల గ్రూప్ వ్యవస్థను బలోపేతం చేయాలి
- కొత్త గ్రూపులను త్వరితగతిన ఏర్పాటు చేయాలి
- క్షేత్రస్థాయి సుడిగాలి పర్యటనలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
రైతులు సేంద్రియ ఎరువుల వినియోగంపై మొగ్గుచూపేలా, భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని అరికట్టేలా రైతులకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని.. ఇందుకు పొలం పిలుస్తోంది వంటి కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
క్షేత్రస్థాయి పర్యటన, ఆకస్మిక తనిఖీల్లో భాగంగా కలెక్టర్ గురువారం ఎ.కొండూరు, జి.కొండూరు మండలాల్లో పర్యటించారు. జి.కొండూరు చెవుటూరు గ్రామంలో ఉపాధి హామీ పధకం ద్వారా మంజూరు కాబడిన నిమ్మతోటను, ఎ.కొండూరు రామచంద్రాపురంలో ఆపిల్ బేర్ (సీమరేగు)ను పరిశీలించారు. తోటల్లో సూక్ష్మ పోషకాల లోపాన్ని గుర్తించి.. సకాలంలో పోషకాలు ఇచ్చేలా రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాలని, ఉద్యాన శాఖ అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది సమన్వయంతో పనిచేసి రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించేలా చేయూతనందించాలని సూచించారు. తోటల్లో కూరగాయలు, చిరుధాన్యాలను అంతర పంటగా వేసుకునేలా, కలుపు సమస్య లేకుండా చూడాలన్నారు. ఉద్యాన పంటలకు స్థానిక మార్కెట్లను అభివృద్ధి చేయాలని, ఆదర్శ రైతులతో ఇతర రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో సీసీ రోడ్ల నాణ్యతపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. రహదారులతో పాటు ఇరువైపులా డ్రెయిన్లు ఉండేలా చూడాలని సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ చెవుటూరులో పశువుల షెడ్‌ను పరిశీలించారు. ఈ షెడ్ల ఉపయోగాలను పాడి రైతులకు వివరించాలని ఈ సందర్భంగా సూచించారు.
దినసరి వేతనం రూ. 295కు తక్కువ కాకుండా చూడాలి
జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాల్లో దినసరి వేతనం రూ. 295కు తక్కువ కాకుండా వచ్చేలా చూడాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. పని ప్రదేశం వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. శ్రమ శక్తి సంఘాల ద్వారా మేట్ వ్యవస్థను బలోపేతం చేయాలని, కొత్త గ్రూపులను త్వరితగతిన ఏర్పాటుచేయాలని సూచించారు. వీలైనంత ఎక్కువ మందికి పని కల్పించాలని, పథకం కింద చేపట్టేందుకు గ్రామాభివృద్ధి, వ్యక్తిగత, సామాజిక పనులను గుర్తించాలని సూచించారు. ఉపాధి పనులపై ఎంపీడీవోలు ప్రతివారం సమావేశాలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా చెత్తనుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణపై దృష్టిపెట్టాలని, ఉత్పాదకతను పెంచేందుకు ఎంపీడీవోలు కృషిచేయాలన్నారు. సహజ సేంద్రియ ఎరువు తయారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని స్పష్టం చేశారు. ఎక్కువ మంది ఔత్సాహిక రైతులను గుర్తించి, ఉద్యాన క్లస్టర్లను ఏర్పాటు చేయాలని, ఉపాధి హామీ పథకం ఊతంతో సన్నచిన్నకారు రైతులకు పండ్ల తోటల పెంపకం దిశగా ప్రోత్సహించాలని సూచించారు. అవసరమైన మొక్కలు దగ్గర్లోనే దొరికేలా చూడాలని, దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో కలెక్టర్ మిర్చి రైతులతో మాట్లాడి, ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఏర్పాటుచేసిన ఫామ్ పాండ్స్‌ను పరిశీలించారు.
కలెక్టర్ వెంట డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.రాము, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి రమేష్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఉద్యాన తదితర శాఖల అధికారులు ఉన్నారు.