అధికారిక కార్యక్రమంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మ వారి ఆత్మార్పణం
*సమాజంలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకం*
*ఆర్యవైశ్య సామాజికవర్గానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం*
*ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్*
రామవరప్పాడు జనవరి 31 : ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మ వారి ఆత్మార్పణం సందర్భంగా శుక్రవారం రామవరప్పాడు లోని శ్రీ వెంకమ్మ పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ వాసవి పేరంటాలమ్మ వారికీ పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు, ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు. సమాజంలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమని రాష్ట్ర అభివృద్ధిలో, ఉద్యోగాల కల్పనలో ఆర్యవైశ్యుల పాత్ర శ్లాఘనీయమని అన్నారు. గత ప్రభుత్వం ఆర్యవైశ్యుల మనోభావాలను దిబ్బతిస్తే కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ లో వాసవి అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించడంతో పాటు ప్రతి నియోజకవర్గంలో అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో హిందూదేవాలయాల పై దాడులు జరిగాయని, రథాలు కూడా దగ్ధం చేసారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అన్ని మతాలకు ప్రాధాన్యత ఇస్తూ అందరి మనోభావాలు కాపాడుతుందని ఎమ్మెల్యే యార్లగడ్డ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.