శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు
ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సత్యనారాయణపురంలోని శ్రీ వాసవి మాత ఆలయాన్ని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి రూపాలలో 'శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి' రూపానికి ఎంతో విశిష్టత ఉందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. వైశ్యుల కులగౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశంతో ఆత్మత్యాగం చేసిన ఆ తల్లి.. వాసవి దేవిగా వైశ్యులకి కులదేవతగా మారిందన్నారు. ఆ చల్లని తల్లి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపైన, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన ఎల్లవేళలా ఉండాలని.. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని కాంక్షించారు. ఆయన వెంట స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తి, నాయకులు కొల్లూరు రామకృష్ణ, చల్లా సుధాకర్, మారుతీ, సనత్, కాళ్ళ ఆదినారాయణ, కురిటి శివ, బంకా బాబీ తదితరులు ఉన్నారు.