అమరావతి : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ పై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి మంత్రి సవిత ప్రశంసలు కురించారు.
బడ్జెట్ లో ఏపీకి అధిక నిధులు కేటాయించినందుకు ప్రధాని నరేంద్రమోడికి, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ కు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కుకు, పోలవరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఊపిరిపోసిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాధి వేసేలా వ్యవసాయానికి, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యమిచ్చారన్నారు. రెక్కలు విరిగిన పక్షిలా ఏపీకి బడ్జెట్ లో అధిక కేటాయింపులు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా, యువతకు ఉపాధి అవకాశాలు అందించేలా కేంద్ర బడ్జెట్ రూపొందించారని మంత్రి సవిత కొనియాడారు. క్యాన్సర్ రోగులకు ఊరట కలిగించేలా జిల్లా ఆసుప్రతుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో ఆరు రకాల ఔషధాలపై పన్ను మినహాయించడం అభినందనీయమన్నారు. ఏపీకి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయింపుపై సీఎం చంద్రబాబునాయుడు కృషి ఎంతో ఉందని మంత్రి సవిత ఆ ప్రకటనలో కొనియాడారు.