ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు
పదో తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా కృషిచేయాలి
- ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు ఉందని.. పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అన్నారు.
స్థానిక పటమట కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, విద్యాశాఖ అధికారులతో కలిసి పదో తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. పాఠ్యాంశాలపై విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని పరీక్షించారు. త్వరలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధులను చేయాలని, పాఠ్యాంశాలపై పట్టు సాధించే దిశగా వారిని తీర్చిదిద్దాలన్నారు. సబ్జెక్టుల వారీగా అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించాలని, వైయక్తిక భేదాలను అనుసరించి విద్యార్థులపై శ్రద్ధచూపి ప్రత్యేకంగా బోధించాలన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఉపాధ్యాయులకు సూచించారు.
ఛైర్మన్ వెంట పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు, జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ, అడిషనల్ డైరెక్టర్లు మధుసూదన్ రావు, శ్రీనివాసరెడ్డి, డీఈవో యు.వి.సుబ్బారావు ఉన్నారు.