*29.03.2025
అట్టహాసంగా నాగ నూకాంబిక జాతర
నాగ నూకాంబిక అమ్మవారి జాతరకు ఎంతో విశిష్టత ఉందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్ ప్రధాన రహదారిలోని శ్రీ శ్రీ శ్రీ నాగ నూకాంబిక అమ్మవారి దేవస్థాన 49 వ ఉగాది జాతర మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గరక మరియు గణాచారి ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో మల్లాది విష్ణు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఉగాదికి ముందురోజు నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని తెలిపారు. కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లిగా నూకాంబికను భక్తులు కొలుస్తారని.. జాతర ప్రారంభానికి ముందుగా తలలపై గరగలు పెట్టుకుని ఆ ప్రాంతమంతా తిరగటం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఉత్సవాలకు స్థానికులే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొంటారని చెప్పారు. నూకాంబిక అమ్మవారి దివ్య ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.