*ఎన్టీఆర్ జిల్లా, నందిగామ, ఏప్రిల్ 1, 2025*
పటిష్ట పర్యవేక్షణతో సజావుగా పెన్షన్ల పంపిణీ
- *పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు తంగిరాల సౌమ్య*
ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు తంగిరాల సౌమ్య నందిగామ మండలం, ఐతవరం గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న ప్రక్రియను
పరిశీలించారు. కేటగిరీల వారీగా లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని అందిస్తున్న తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ, శాసనసభ్యులు తంగిరాల సౌమ్య మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అధికారుల పర్యవేక్షణతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం జరుగుతోందన్నారు. స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాలకు అనుగుణంగా పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు, పూర్తిస్థాయిలో పేదరిక నిర్మూలనకు జిల్లాస్థాయి ప్రణాళికల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలన్నారు.
కార్యక్రమంలో నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.