*ఎన్‌టీఆర్ జిల్లా/నందిగామ, ఏప్రిల్ 01, 2025*
మూగజీవాలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు
- *గ్రామాల్లో యుద్దప్రాతిపదికన నీటి తొట్టెల ఏర్పాటు*
- *ఉపాధి హామీ పథకం అనుసంధానంతో నిర్మాణం*
- *కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు తంగిరాల సౌమ్య*
వేసవి ఎండల దృష్ట్యా మూగజీవాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా యుద్ధప్రాతిపదికన నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు తంగిరాల సౌమ్య తెలిపారు.
కలెక్టర్ లక్ష్మీశ, శాసనసభ్యులు తంగిరాల సౌమ్య మంగళవారం నందిగామ మండలం, ఐతవరం గ్రామంలో నీటి తొట్టె నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 48 నీటి తొట్టెలను ఏర్పాటు చేయడం జరిగిందని.. మంగళవారం మరో 143 ఆవాసాల్లో తొట్టెల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. వేసవి తాగునీటి కార్యాచరణలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ముఖ్యమైన పాయింట్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని.. ఇదే విధంగా పశు సంపదకు తాగునీటికి ఇబ్బంది లేకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సహకారంతో నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక నీటి తొట్టె నిర్మాణానికి రూ. 33 వేలు మంజూరవుతుందన్నారు. జిల్లాలోని 780 ఆవాసాల్లోనూ నీటి తొట్టెల ఏర్పాటుకు స్థలాలను గుర్తించి, తక్షణమే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో త్వరితగతిన తొట్టెల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జిల్లా పశు సంవర్థక అధికారి డా. ఎం.హనుమంతరావు, డ్వామా పీడీ ఎ.రాము, నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.