*01.04.2025*
జిల్లాలో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి..
- *వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు*
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక బంగారంలా మారిపోయిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. పేరుకే ఉచితమైనా.. స్టాక్ పాయింట్ నుంచి రవాణా ఛార్జీల పేరిట అధికమొత్తంలో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏడాదికి రూ. 3 వేల కోట్ల ఆదాయం ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చేదని.. కానీ ఈ ప్రభుత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి కిందిస్థాయి తెలుగుదేశం కార్యకర్తల వరకు ఇసుక ఒక ఆదాయ వనరుగా మారిపోయిందన్నారు. చట్టసభలలో ఉండే ప్రజాప్రతినిధులే ఇటువంటి అక్రమాలకు పాల్పడితే.. సామాన్యుల సొంతింటి కల నెరవేరేదెలా..? జిల్లాలో లక్ష మందికిపైగా భవననిర్మాణ రంగంపై ఆధారపడి పని చేస్తుండగా.. అనుబంధంగా రాడ్ బెండింగ్, సెంట్రింగ్, ఫ్లంబింగ్, పెయింటింగ్, ఫాల్స్ సీలింగ్, మార్బుల్స్, టైల్స్ వంటి 36 రకాల వృత్తుల వారు పని చేస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. గతంలో రూ.4 వేలు, 5 వేలకే దొరికే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు రూ.20 వేలు పలుకుతోందని.. ప్రభుత్వ నేతల అడ్డగోలు దోపిడీ కారణంగా భవన నిర్మాణ రంగం సంక్షోభంలో పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, పెనమలూరు, ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాలలో ఇసుక దోపిడీ అధికంగా జరుగుతోందన్నారు. యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతూ.. టన్నుల కొద్ది ఇసుకను ఏకంగా హైదరాబాద్ కు తరలిస్తున్నారని ఆరోపించారు. స్టాక్ పాయింట్ నుంచి మెయిన్ రోడ్డు వరకు చిన్న చిన్న వాహనాలు, ట్రాక్టర్ల ద్వారా.. అక్కడి నుంచి లారీల ద్వారా తెలంగాణకు తరలిస్తున్నారని చెప్పారు. తాజాగా తిరువూరు మీదుగా తెలంగాణ ప్రాంతానికి యథేచ్ఛగా రోజుకు 15 నుంచి 20 టిప్పర్ల ఇసుకను అనధికారికంగా తరలిస్తున్నట్లు పత్రికలలో కథనాలు వచ్చినా.. అధికారులు పట్టనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. అక్కడ పట్టణ శివారులోని ఆంధ్ర-తెలంగాణ బోర్డర్ చెక్ పోస్టు వద్ద పోలీసు సిబ్బంది లేకపోవడం, గతంలో బైపాస్ రోడ్డులో ఉన్న ఆర్టీఏ చెక్ పోస్ట్ తొలగించడంతో.. అనధికార రవాణాకు అడ్డంకి లేకుండా పోయిందన్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై కనీస ప్రస్తావన రాకపోవడం శోచనీయమన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో 7 ఇసుక రీచ్ లు ఉండగా.. కూటమి అధికారంలోకి వచ్చే నాటికి స్టాక్ పాయింట్లలో 12 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని మల్లాది విష్ణు చెప్పారు. ప్రభుత్వం మారిన వెంటనే 6 లక్షల టన్నుల ఇసుకను మాయం చేశారని.. మరో 3 లక్షల టన్నుల ఇసుకకు లెక్కాపద్దూ లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం ఉన్న రీచ్ లకు కూడా తెలుగుదేశం నేతలే టెండర్లు వేసి.. రీచ్ లు లేని ప్రాంతాలలోనూ ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు.
*కొరవడిన డ్రోన్ల పర్యవేక్షణ:* టెక్నాలజీ ద్వారా డ్రోన్ల సాయంతో ఇసుక మాఫియాను అరికడతామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటోందని మల్లాది విష్ణు అన్నారు. గతంలో రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా తరలించిన ఇసుకాసురులు ప్రస్తుతం పట్టపగలు కూడా నిర్భయంగా రవాణా చేస్తున్నారని మాట్లాడారు. అయినా నిఘా నేత్రాలు ఏం చేస్తున్నాయో తెలియని పరిస్థితి..? డ్రోన్ల ద్వారా పేకాట రాయుళ్లను పట్టుకోవడంపై చూపుతున్న శ్రద్ధ.. ఇసుక మాఫియాపై ఎందుకు చూపడం లేదని సూటిగా ప్రశ్నించారు. అలాగే రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ, పోలీసుల నిఘా కొరవడి టన్నుల కొద్దీ ఇసుక అక్రమంగా తెలంగాణకు తరలిపోతోందన్నారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఇసుకను ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై బలప్రయోగానికీ వెనుకాడటం లేదన్నారు. ఇటీవల జి.కొండూరు మండలం సీతారాంపురంలో ఇంటి ప్రహరీ నిర్మాణానికి ఇసుక కోసం బుడమేరు వాగు వద్దకు వెళ్లిన ఆకుల రామారావుపై మొండితోక గోపాలరావు అతని అనుచరులు కర్రలు, ఇటుకలతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు గుర్తుచేశారు. అలాంటప్పుడు రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలు ఏం చేస్తున్నట్లు..? కరోనా సమయంలో ఏపీ వాహనాలను తెలంగాణ సరిహద్దుల్లోకి కూడా అనుమతించలేదని.. అలాంటప్పుడు ఇసుక అక్రమ రవాణాకు అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. వారసత్వ సమస్య పేరుతో పైకి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా.. కేబినెట్, సీఎల్పీ సమావేశాలు, టెలీ కాన్ఫరెన్స్ లు వింటుంటే ఎమ్మెల్యేల అడ్డగోలు దోపిడీ అర్థమైపోతోందని మల్లాది విష్ణు అన్నారు. దీనిపై గుర్రం గోవింద్ అనే వ్యక్తి ధైర్యంగా టెలీ కాన్ఫరెన్స్ లో ప్రశ్నిస్తే.. అతని లైన్ ను కట్ చేయడం చూశామన్నారు. కానీ జిల్లాలో భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది గొంతులను మాత్రం నొక్కలేరని విష్ణు అన్నారు. జీవోలను సైతం ఉల్లంఘిస్తూ.. ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు దోపిడీకి పాల్పడుతున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. కనుక ఇప్పటికైనా ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఒక హై పవర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు 24/7 చెక్ పోస్టులో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఇకపై ఒక తట్ట ఇసుక కూడా ఎన్టీఆర్ జిల్లా నుంచి తెలంగాణకు తరలిపోకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారు. అలాగే గత 11 నెలల్లో జరిగిన ఇసుక దోపిడీపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని.. లేనిపక్షంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ నాయకులు, శ్రేణులందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమ బాట పడతామని మల్లాది విష్ణు హెచ్చరించారు.