ఎన్‌టీఆర్ జిల్లా, ఏప్రిల్ 17, 2025
వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా పకడ్బందీ చర్యలు
వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా ఏర్పాట్లు
ఈ-వ్యర్థాల నిర్వహణ ఇతివృత్తంతో ఈ నెల స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
జిల్లాలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి కలెక్టర్ లక్ష్మీశ వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా తీసుకున్న చర్యలు, వచ్చే వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా ప్రస్తుతం తీసుకోవాల్సిన చర్యలు, ఎంఎస్ఎంఈ సర్వే, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, పీఎం సూర్యఘర్, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై తదితరాలపై సీఎస్ మార్గనిర్దేశం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా వేసవిలో తాగునీటి సరఫరా పర్యవేక్షణకు పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజావసరాలు, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ఉన్న ఇసుక స్టాక్ యార్డ్‌లలో దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలను సిద్ధం చేసి, ఇసుక కొరతకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు అవసరమైన భూమిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతినెలా మూడో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని.. ఈ నెల మూడో శనివారం ఈ-వ్యర్థాల రీసైక్లింగ్ ప్రధాన అంశంతో కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పర్యావరణ హిత ఈ-వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఈ-వ్యర్థాల సేకరణపై శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎ.శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, ఏపీఐఐసీ జెడ్ఎం కె.బాబ్జి, డీపీవో పి.లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు.