నేడో.రేపో.మలివిడత ఏఎంసీ చైర్మన్ల జాబితా
15 రోజుల్లో మిగిలినవి కూడా భర్తీ.. నెలాఖరు లోగా పీఏసీఎస్ పాలకవర్గాలు నియామకం
నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ల నియామకానికి కసరత్తు కొలిక్కివస్తోంది. మొత్తం 218 ఏంఎసీల్లో తొలి విడతగా గత నెల 28న 47 ఏఎంసీలకు చైర్మన్లను ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో మరో 50 ఏఎంసీ చైర్మన్ల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. మిగతా నియామకాలు కూడా 15 రోజుల్లో పూర్తిచేసేయాలని భావిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో సీఎం చంద్రబాబు గ్రామ స్థాయి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఆచితూచి అడుగు వేస్తుండడంతో కాస్త జాప్యం జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడం కోసమే విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. వీటితోపాటే దేవాయలయ కమిటీలనూ ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్)ల భర్తీపై దృష్టి సారించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,250 పీఏసీఎస్ లు ఉన్నాయి. వీటికి చివరిసారిగా 2013లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత నామినేటెడ్ చైర్మన్లు లేదా పర్సన్ ఇన్‌చార్జులతో నడిపిస్తున్నారు.